మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుగా మాట్లాడారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఖులాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని, అయితే ఇది చట్టప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) కి అప్పగించిందని, దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫడ్నవీస్ తప్పుబట్టారు.
సీఎం ఫడ్నవీస్ వ్యాఖ్యలపై బీజేపీ సతారా ఎంపీ, ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజె భోసాలె స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధిని తొలగించడానికి చట్టాలతో పనేముందని, సింపుల్ గా ఓ జేసీబీని పంపించి ఔరంగజేబ్ సమాధిని నేలమట్టం చేయాలని కోరారు. ఔరంగజేబ్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాలని భావించే వారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో పెట్టుకోవచ్చని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకానీ మరాఠా గడ్డపై ఔరంగజేబ్ ను కీర్తిస్తే ఇకపై సహించబోమని తేల్చిచెప్పారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్ ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయన్ రాజె భోసాలె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ, రాజమాత జిజావు ఛత్రపతి, శంభాజీ మహరాజ్ లను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు