అంతర్జాతీయ డ్రగ్ డీలర్ షెహనాజ్ సింగ్ అలియాస్ షాన్ భిందెర్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇంటర్నేషనల్ డ్రగ్ లార్డ్ గా పేరొందిన షెహనాజ్ పై అమెరికా సహా పలు దేశాల్లో కేసులు ఉన్నాయి. ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్ జాబితాలో సైతం షెహనాజ్ సింగ్ ఉన్నారు. నార్కోటిక్స్ సిండికేట్‌లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడని పంజాబ్ పోలీసులు వెల్లడించారు.
షెహనాజ్ కొలంబియా నుంచి అమెరికా, కెనడాలోకి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇక షెహనాజ్ అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టిన అమెరికా ఎఫ్‌బీఐ ఫిబ్రవరి 26న అతడి అనుచరులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి 391 కేజీల మెథంఫెటమైన్, 109 కేజీల కొకైన్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ కారణంగానే షెహనాజ్ భారత్‌కు పారిపోయి వచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు.
షెహనాజ్ గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం రావడంతో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్టు పంజాబ్ పోలీసులు స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పడానికి ఈ ఆపరేషన్ నిదర్శనమన్నారు.