ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. ఆ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూటమి ఎమ్మెల్యేలు సోము వీర్రాజు అభ్యర్థిత్వానికి మద్దతుగా సంతకాలు చేయనున్నారు.
సోము వీర్రాజుకు కలిసొచ్చిన కాలం
నామినేషన్లకు సోమవారం చివరి రోజు కావడంతో సోము వీర్రాజు పేరు ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. దీనిపై శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుకు హైకమాండ్ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్సీ సీటు కోసం దాదాపు అరడజను నేతలు పోటీ పడ్డారు. సోము, మాధవ్, పాకాల సత్యనారాయణ పాటు మరో ముగ్గురు నేతలు పోటీ పడ్డారు. రెండు రోజుల కిందట ఆయా నేతలు ఢిల్లీలో మకాం వేశారు.
రాజకీయ సమీకరణాలు పరిశీలించిన పార్టీ హైకమాండ్, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని భావించింది. సీనియర్లను పక్కన పెట్టేశారని అంటారని భావించి తెరపైకి సోము వీర్రాజు పేరు ఖరారు చేసింది. దీనికితోడు ఆయనకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నుంచి ఫుల్ మద్దతు ఉండడంతో ఖరారు చేసినట్టు కమలం వర్గాలు చెబుతున్నాయి.
మండలికి రెండోసారి
గతంలో టీడీపీ ప్రభుత్వంలో సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పని చేశారు. 2014-19 మధ్యకాలంలో మండలిలో ఆయన అడుగు పెట్టారు. ఆ తర్వాత ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన , బీజేపీ నుంచి ఒకొక్కరు ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
ఎమ్మెల్సీగా పని చేసిన సమయంలో మండలిలో బీజేపీ తరపున వాయిస్ బలంగా వినిపించారు సోము వీర్రాజు. తన ప్రశ్నలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశారు కూడా. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఆయన కోసం అనపర్తి సీటు హైకమాండ్ కేటాయించింది. తనకు అనపర్తి వద్దని చెప్పేశారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ తరపున ఆయన పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి కావలి గ్రీష్మ, కర్నూలు నుంచి బీటీ నాయుడు, నెల్లూరు నుంచి బీద రవిచంద్ర ఉన్నారు. జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఉన్నారు. ఇక వీర్రాజుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆయన లేనట్టేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఆ పదవికి సైతం ఆరేడు మంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఈసారి రాయలసీమ వ్యక్తికి ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు. కాకపోతే వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ రేసు నుంచి ఆయన దాదాపుగా తప్పుకున్నట్టేనని అంటున్నారు.
బీజేపీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి సోము వీర్రాజు. పార్టీకి పూర్తిగా అంకితమైన నాయకుడు. కాకపోతే జగన్‌కు అత్యంత సానుభూతిపరుడుగా ఆయన్ని టీడీపీ నేతలు భావిస్తారు. గతంలో చంద్రబాబుపై ఆయన చేసిన విమర్శలే అందుకు కారణం. రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సమయంలో టీడీపీ అంటే తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెల్సిందే.