ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే కోటా ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగతా నాలుగు స్థానాల కోసం తెదేపాలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయించి.. మిగిలిన మూడు స్థానాలకు టీడీపీ అధిష్టానం అభ్యర్ధులను ప్రకటించింది.
ఛాన్స్ దక్కించుకున్న వారిలో కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు ఉన్నారు. వీరిలో గ్రీష్మ ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా.. బీద రవిచంద్ర, బీటీ నాయుడు బీసీ వర్గానికి చెందిన వారు. చివరి నిమిషంలో భాజపా పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించినట్టు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్సీ స్థానం ఆశించిన వారిలో సుమారు 25 మంది ఉన్నారు. వారిలో దాదాపు 10 మంది మాత్రం సీరియస్‌గా ప్రయతనలు చేసినట్టు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను సైతం తమకు మద్దతుగా ఉన్న నాయకులతో పాటు కలిసినట్టుగా కూడా చెబుతున్నారు. కానీ ఈసారి ఛాన్స్ దక్కని వారికి 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు సర్ది చెబుతున్నారు.
బీజేపీకి ఒక సీటు సర్దుబాటు చేయడంతో ఒక స్థానాన్ని ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు సీనియర్ నేతలు. ఇప్పటికే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్‌కు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక ఛాన్స్ దక్కించుకున్న నేతలు సీఎం చంద్రబాబు, లోకేష్ లకు తమ కృతజ్ఞతలు చెబుతున్నారు.