వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులకు టోకరాల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కేసుల్లో పోలీసు స్టేషన్లలో విచారణల సందర్భంగా, కోర్టుకు, జైలుకు ప్రయాణాల సందర్భంగా, రిమాండ్ విధించాక పోలీసుల రాచమర్యాదలు అందుకున్న బోరుగడ్డ ఇప్పుడు ఏకంగా జైల్లో నుంచే హాయిగా వైసీపీ నేతలతో కాన్ఫరెన్స్ కాల్స్ చేసినట్లు విచారణలో గుర్తించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యుల్ని దారుణంంగా తిట్టిన ఆరోపణలపై అరెస్టు అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను గతంలో పోలీసులు రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అఅయితే అక్కడ రిమాండ్ ఖైదీగా ఉంటూనే బోరుగడ్డ పలు కుట్రలు చేసినట్లు జైలు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. తాజాగా ఆయన ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ వివాదం తెరపైకి రావడంతో ఆయన కదలికల్ని గుర్తించగా.. అందులో ఈ కాన్ కాల్స్ వ్యవహారం బయటపడినట్లు సమాచారం.
జైలు నిబంధనల ప్రకారం వారానికి మూడు సార్లు కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో రిమాండ్ ఖైదీలు ఫోన్ కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఉంది. దీంతో బోరుగడ్డ ఇలా వారికి ఫోన్లు చేయడం, వారు ఇతరులతో కాన్ఫరెన్స్ కాల్స్ కల్పించడం వంటివి జరిగినట్లు పోలీసుల ఆలస్యంగా గుర్తించారు. వాస్తవానికి జైల్లో ఖైదీలు ఇలా ఫోన్ కాల్స్ చేసినా వాటిని రికార్డు చేయడం, వాటిని అవసరాన్ని బట్టి పరిశీలించడం జరుగుతుంది. కానీ బోరుగడ్డ విషయంలో అలాంటివేవీ జరగకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు వైసీపీ నేతలతో బోరుగడ్డ ఇలా కాన్ కాల్స్ లో మాట్లాడినట్లు చెప్తున్నారు.
అంతేకాదు ఈ కాన్ కాల్స్ లోనే ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ తయారు చేసి కోర్టుకు సమర్పించే కుట్రకు బీజం పడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ కాల్ రికార్డుల ఆధారంగా బోరుగడ్డకు ఉచ్చు బిగించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఈ మేరకు జైలు అధికారులు సీడీఆర్ రికార్డులు కోరినట్లు సమాచారం.