కాంగ్రెస్ తమ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఖరారు చేసింది. అయిదు స్థానాల్లో కాంగ్రెస్ కు నాలుగు సీట్లు దక్కనున్నాయి. బీఆర్ఎస్ కు దక్కే ఒక్క స్థానం నుంచి దాసోజు శ్రావణ్ పేరు ఖరారు చేసారు. మిత్రపక్షం సీపీఐకు ఒక సీటు కేటాయించిన కాంగ్రెస్.. తమ పార్టీ నుంచి ఎస్సీ – ఎస్టీ వర్గాలకు ఒక్కో సీటు కేటాయించారు. అనూహ్యంగా బీసీ – మహిళా కోటాలో విజయశాంతి పేరు ప్రకటించారు. అయితే, విజయశాంతి పేరు ప్రకటన వెనుక అనూహ్య పరిణామాలు.. సమీకరణాలు చోటు చేసుకున్నాయి. మరో కీలక పదవి పైన విజయశాంతికి హామీ దక్కినట్లు తెలుస్తోంది.
రాములమ్మకు జాక్ పాట్
తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు లో కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ అధి నాయకత్వం పక్కా వ్యూహాత్మకంగా ముగ్గురు అభ్యర్ధులను ఖరారు చేసింది. రేవంత్ ఛాయిస్ మేరకు ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ కు సీటు ఖరారైంది. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరును ఫైనల్ చేసారు. శంకర్ నాయక్ సుదీర్ఘ కాలం పార్టీలో పని చేసారు. ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని తాజాగా సీనియర్ నేత జానారెడ్డి సిఫార్సు చేసారు. ఇక, అనూహ్యంగా బీసీ కోటాలో పార్టీ సీనియర్లు పలువురు చివరి నిమిషం వరకు రేసులో ఉన్నారు. అయితే..మాజీ ఎంపీ విజయశాంతి పేరును పార్టీ ఎంపిక చేసింది. ఈ ఎంపిక వెనుక పార్టీ ముఖ్య నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ కోటా
విజయశాంతి ఇటీవలే పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను కలిసారు. రాష్ట్రంలో ప్రభుత్వం – పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. తాను పార్టీలో క్రియాశీలకంగా పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రే తనకు ఇచ్చిన హామీని గుర్తు చేసారు. ఇదే అంశం పైన ఎమ్మెల్సీల ఖరారు వేళ ఖర్గే – కేసీ వేణుగోపాల్ మధ్య చర్చ జరిగింది.తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ తోనూ మాట్లాడారు. మీనాక్షి.. ఎమ్మెల్సీగా రాములమ్మ కు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు పార్టీ నేతల సమాచారం.
మరో కీలక పదవి
ఇదే సమయంలో పార్టీతో పాటుగా ప్రభుత్వంలోనూ రాములమ్మకు అవకాశం ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతల ఆలోచనగా తెలుస్తోంది. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి అవకాశం దక్కనున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల ద్వారా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయశాంతి యాక్టివ్ గా లేరు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ హైకమాండ్ తో నేరుగా సంప్రదింపులు చేసి సీటు దక్కించుకున్నారు. అధిష్ఠానం కోటాలో ఎమ్మెల్సీ అవుతున్న విజయశాంతి.. మంత్రి కూడా అవుతారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ కొనసాగుతున్న వేళ విజయశాంతి జాక్ పాట్ కొట్టారని పార్టీలో చర్చ జరుగుతోంది.