వైసీపీ సానుభూతిపరుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. తల్లికి అనారోగ్యం ఉందంటూ హైకోర్టులో బెయిల్ తీసుకుని, ఆ తర్వాత దాని పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. స్వస్ధలం గుంటూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బోరుగడ్డ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ బెయిల్ తీసుకుని పారిపోతుంటే ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వ లాయర్లు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బోరుగడ్డకు ఫేక్ సర్టిఫికెట్ అని తెలియక హైకోర్టు బెయిల్ పొడిగించేందుకు సిద్ధమైనప్పుడు ప్రభుత్వ లాయర్ దాన్ని చెక్ చేసుకోకుండా అలా ఎలా ఒప్పుకున్నారన్న దానిపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. దీంతో బోరుగడ్డకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించిన ప్రభుత్వ లాయర్ పై ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తోంది.
మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీలో పరారయ్యాక అజ్ఢాతంలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆయన గతంలో తిరిగిన ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టడంతో పాటు ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేస్తున్నారు. ఇందులో బోరుగడ్డ సెల్ ఫోన్ నంబర్ మార్చి కొత్త నంబర్ తో కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు కూడా అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోరుగడ్డ విదేశాలకు పారిపోకుండా గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు పనికొస్తున్నాయి. దీంతో ఎంతో కాలం బోరుగడ్డ తప్పించుకుని తిరిగే అవకాశం లేదని పోలీసులు చెప్తున్నారు.