AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీడీఆర్ బాండ్లపై మూడు నెలల్లో క్లారిటీ : ఏపీ మంత్రి నారాయణ..

గ‌త ప్ర‌భుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్ర‌మాలతో పాటు అన్ని అంశాల‌పై మూడో నెలల్లో ఒక క్లారిటీ వస్తుందని, విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

 

గ‌త ప్ర‌భుత్వ హయాంలో విశాఖ‌ప‌ట్నంలో టీడీఆర్ బాండ్ల జారీలో జ‌రిగిన అక్ర‌మాల‌పై రీజిన‌ల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్‌తో పాటు సీఐడీ విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సమయంలో విశాఖ‌ప‌ట్నం తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి నారాయ‌ణ ఈ మేరకు స‌మాధానం ఇచ్చారు.

 

టీడీఆర్ బాండ్ల జారీలో ఒక్క విశాఖ‌ప‌ట్నంలోనే కాకుండా త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్ర‌మాలు జ‌రిగాయ‌ని మంత్రి తెలిపారు. త‌ణుకులో 63.24 కోట్ల విలువైన బాండ్లు ఇవ్వాల్సి ఉండ‌గా, 754 కోట్ల‌కు బాండ్లు జారీ చేశార‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని భూమిని ఇచ్చి, ప‌ట్ట‌ణంలో ఉన్న ఇంటి అడ్ర‌స్ ఇవ్వ‌డంతో ఆ ఇంటి విలువ ఆధారంగా బాండ్లు జారీ చేసిన‌ట్లు మంత్రి వెల్లడించారు.

 

ఇదే విధంగా తిరుప‌తిలో 170.99 కోట్ల విలువైన 29 బాండ్లు జారీ చేశార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు జ‌ర‌గ‌డంతో తమ ప్ర‌భుత్వం రాగానే టీడీఆర్‌లు నిలిపివేశామ‌ని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్ బాండ్ల జారీ పెండింగ్‌లో వుందని మంత్రి వివరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10