AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రానా స్టే పిటిషన్‌ను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు..

తనను భారత్‌కు అప్పగించకుండా స్టే విధించాలన్న ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహావుర్ రానా పెట్టుకున్న పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తహావుర్‌ను భారత్‌కు అప్పగించేందుకు ట్రంప్ అంగీకరించారు. దీంతో తనను భారత్‌కు పంపకుండా అడ్డుకోవాలన్న తహావుర్ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

 

రానా అప్పగింతపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ ఎలెనా కగన్ తిరస్కరించారు. 63 ఏళ్ల రానా పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఎల్‌ఈటీ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో సంబంధాలు కలిగిన రానా 2008 ముంబై ఉగ్రదాడి కుట్రలో ప్రధాన నిందితుడు. నాటి ఘటనలో 175 మంది మరణించారు.

 

తాను పాకిస్థాన్ సంతతికి చెందిన ముస్లింను కావడంతో తనను భారత్‌క్ అప్పగిస్తే చిత్రహింసలు పెడతారని, కాబట్టి తనను ఆ దేశానికి అప్పగించవద్దని తహావుర్ రానా ఈ వారం మొదట్లో కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశాడు. గత నెలలో భారత ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ‘దుష్టుడైన’ రానాను భారత్‌కు అప్పగించేందుకు తన యంత్రాంగం అంగీకరించినట్టు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత రానా సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడాయనకు ఎదురుదెబ్బ తగిలింది.

ANN TOP 10