AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వల్లభనేని వంశీని రెండున్నర గంటలపాటు విచారించిన అధికారులు..! 20 పైగా ప్రశ్నలు..

సత్యవర్థన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని, కానీ, అతడు సత్యవర్ధన్ అని తనకు తెలియదని వైసీపీ నేత వల్లభనేని వంశీ తెలిపారు. తొలిరోజు కస్టడీలో అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనకు తెలియదని, గుర్తు లేదని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఆయనను దాదాపు రెండున్నర గంటలపాటు విచారించిన అధికారులు 20 ప్రశ్నలు అడిగారు. కొన్ని వీడియోలు కూడా చూపించి ప్రశ్నించారు.

 

మూడు రోజుల కస్టడీలో భాగంగా నిన్న ఉదయం 11 గంటలకు జైలు నుంచి వంశీ, శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం 12.45 గంటలకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ దాటవేత ధోరణి ప్రదర్శించినట్టు సమాచారం.

 

సత్యవర్ధన్‌ను ఎందుకు అపహరించారు? కారులో హైదరాబాద్‌లోని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు? విశాఖపట్నంలోని హోటల్, అపార్ట్‌మెంట్‌లలో ఎందుకు ఉంచారు? వంటి ప్రశ్నలకు వంశీ బదులిస్తూ.. అతడిని తాము కిడ్నాప్ చేయలేదని, రాయదుర్గంలోని తమ ఇంటికి వచ్చి ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడని, మరుసటి రోజు తమ వారితో కలిసి కారులో వెళ్లిపోయాడని చెప్పారు. అప్పుడు అతడే సత్యవర్ధన్ అని తనకు తెలియదని, తన ఇంటి నుంచి ఎక్కడికి వెళ్లాడో తెలియదని, అతడితో తనకేం సంబంధం లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది.

 

కేసును ఉపసంహరించుకునేలా సత్యవర్థన్‌పై ఎందుకు ఒత్తిడి తెచ్చారన్న మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అందులో తన ప్రమేయం ఏమీ లేదని, తనంతట తానే కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. 12న తాడేపల్లి ఎందుకు వెళ్లారని, అక్కడ ఎవరిని కలిశారన్న పోలీసుల ప్రశ్నలకు.. తాను తాడేపల్లి వెళ్లింది నిజమే కానీ, అక్కడ ఎవరినీ కలవలేదని సమాధానమిచ్చారు.

 

తాను వాడే మూడు ఫోన్లను ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదన్నారు. తనపై 16 కేసులు ఉన్న సంగతి తెలుసని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. తనకు ఒకే నంబరుతో ఒక బెంజికారు, ఒక ఆడిక్యూ7 కారు ఉన్నాయని విచారణలో వంశీ చెప్పినట్టు సమాచారం. కాగా, విచారణ అనంతరం మధ్యాహ్నం 3.25 గంటలకు మరోమారు వైద్య పరీక్షలు చేయించి వంశీని జైలుకు అప్పగించారు.

ANN TOP 10