AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తప్పదా..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగలేలా కనిపిస్తోంది. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు పదుల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

 

త్వరలో 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ భవన్‌లో జరిగిన సమావేశానికి కార్పొరేటర్లను అనుమతించకపోవడంతో ఈ కార్పొరేటర్లంతా అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.

 

గ్రేటర్ పరిధిలోని 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఫసియుద్దీన్ తెలిపారు. గత తొమ్మిదేళ్లుగా స్టాండింగ్ కమిటీలో ప్రాతినిథ్యం లేని కాంగ్రెస్ నుంచి ఈసారి ఏడుగురు సభ్యులు ఉండనున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందన్నారు.

 

వచ్చే బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఉండబోతోందని బాబా ఫసియుద్దీన్ చెప్పుకొచ్చారు. కాగా, ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. స్టాండింగ్ కమిటీలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎంఐఎంకు చెందిన ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఫసియుద్దీన్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది.

ANN TOP 10