AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెత్త పన్నుపై గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తీపి కబురు వినిపించింది. కోట్లాదిమంది ప్రజలకు ఊరట కలిగించే శుభవార్త అది.

 

చెత్త పన్నును పూర్తిగా రద్దు

 

చెత్త పన్నును పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదలైంది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి సర్కార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు వసూలు చేస్తూ వస్తోన్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించినట్టయింది.

 

2024 డిసెంబరు 31వ తేదీ నుంచి..

 

2024 డిసెంబరు 31వ తేదీ నుంచి చెత్త పన్ను రద్దు అమలులోకి వచ్చినట్లు ఏపీ మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫలితంగా- నగరాలు, పట్టణాల్లో చెత్త పన్నును చెల్లించాల్సిన అవసరం ఉండబోదని, గతంలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.

 

ఏపీ అసెంబ్లీ ఆమోదం

 

ఈ చెత్త పన్నును రద్దు చేయడానికి గత ఏడాది నవంబర్ 21వ తేదీన బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అప్పట్లో దీన్ని సభలో ప్రవేశపెట్టారు. నగరాలు, పట్టణాల్లో నివసించే వారిపై ఆర్థిక ఇబ్బందిని తొలగించడంలో భాగంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు అప్పట్లో వివరించారు.

 

వైసీపీ హయాంలో..

 

రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణకు నిధులు సమకూర్చడానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ చెత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గృహాలకు ప్రతి నెలా 30 నుండి 120 రూపాయలు, వాణిజ్య సంస్థలకు 100 నుండి 10,000 రూపాయల వరకు వసూలు చేసింది.

 

రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత..

 

ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు 51,641 నుండి 62,964 రూపాయల వరకు కేటాయించింది. దీనివల్ల నెలకు 13.9 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. ఈ చెత్త పన్ను పట్ల రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత ఎదురైంది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది.

 

గెజిట్ నోటిఫికేషన్..

 

దీన్ని నిలబెట్టుకుంది. చెత్త పన్నును రద్దు చేయడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించింది. సభలో బిల్లు సైతం ఆమోదం పొందింది. తాజాగా దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. చెత్త పన్ను వసూళ్లకు చెందిన ఏపీ మున్సిపల్‌ చట్టం-1965లో చేర్చిన సెక్షన్‌ 170 (బీ), మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1955లోని సెక్షన్‌ 491 (ఎ)ను తొలగించినట్లు వెల్లడించింది.

ANN TOP 10