AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తమిళనాట మళ్లీ భాషా రాజకీయం..!

తమిళనాడులో మళ్లీ భాషా రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జాతీయ విద్యావిధానం (నేషనల్ ఎడుకేషన్ పాలసీ – NEP) అమలుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. “తేనెతుట్టెపై రాళ్లు రువ్వొద్దు” అని హెచ్చరించారు. డీఎంకే (DMK) పార్టీ ఉనికిలో ఉన్నంత కాలం, తమిళ భాష మరియు రాష్ట్ర ప్రజలకు ఎటువంటి హాని కలిగించే చర్యలను అనుమతించనని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) విద్యను రాజకీయం చేయొద్దని చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఎంకే స్టాలిన్‌ ఈ విధంగా కౌంటర్‌ ఇచ్చారు.

 

“రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? మీరా? మేమా? త్రిభాషా విధానానికి అంగీకరిస్తేనే నిధులు విడుదల చేస్తామని బ్లాక్‌మెయిల్‌ చేయడం రాజకీయం కాదా? ఎన్‌ఈపీ (NEP) పేరుతో హిందీని రుద్దడం రాజకీయం కాదా? భిన్న భాషలున్న దేశాన్ని ఒకే భాష దేశంగా మార్చాలనుకోవడం రాజకీయం కాదా? ఒక పథకానికి కేటాయించిన నిధులను మరో పథకానికి మళ్లించడం రాజకీయం కాదా?” అని ఎంకే స్టాలిన్‌ వరుస ప్రశ్నలతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అసలు రాజకీయాలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని కేంద్రం ఆలోచించాలని ఆయన సూచించారు.

 

ప్రజల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంటే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మతపరమైన ఉద్రిక్తతల కోసం ఖర్చు చేస్తోందని స్టాలిన్‌ ఆరోపించారు. ప్రధానమంత్రి శ్రీ స్కూల్‌ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల తమిళనాడు రూ. 5000 కోట్లు నష్టపోతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై సిఎం స్టాలిన్ స్పందిస్తూ.. “మంత్రి గారూ, తమిళనాడు నుంచి వచ్చే పన్నులు మీకు ఇవ్వము అని చెప్పడానికి ఒక్క సెకను సమయం కూడా పట్టదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

సమాఖ్య స్ఫూర్తి అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని.. రాజ్యాంగం ప్రధాన లక్షణం కూడా ఇదేనని స్టాలిన్‌ పేర్కొన్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా పాలించడం దేశానికి పెద్ద శాపమన్నారు. నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది విద్యను ప్రోత్సహించేందుకు కాదని.. కేవలం హిందీని వ్యాప్తి చేసేందుకేనని తమిళనాడు ముఖ్యమంత్రి మండిపడ్డారు.

 

మరోవైపు ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌ కూడా తమిళ భాషతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌.. తమ పార్టీ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కమల్‌ హాసన్‌.. తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

 

కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. భాష విషయంలో తమిళులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారన్నారు. భాషను రక్షించుకోవడంలో వారి పోరాటాన్ని ఉద్ఘాటించారు. హిందీ అమలుకు వ్యతిరేకంగా తమిళనాడు చేసిన చారిత్రక పోరాటాన్ని ప్రస్తావించారు. భాషా సమస్యలను తేలికగా తీసుకునేవారిని ఆయన హెచ్చరించారు. “భాష కోసం తమిళులు ప్రాణాలు కోల్పోయారు. భాషతో ఆటలాడొద్దు. తమిళులతో పాటు వారి చిన్నారులకు సైతం తమ మాతృ భాష ఎంత అవసరమో తెలుసు. వారికి ఏ భాష ఎంచుకోవాలో స్పష్టత ఉంది” అని కమల్‌ హాసన్‌ పరోక్షంగా కేంద్రంపై విమర్శలు చేశారు. కమల హాసన్ కు చెందిన ఎంఎన్ఎం, అధికార డిఎంకె మధ్య పొత్తు ఉన్న విషయం విదితమే.

ANN TOP 10