వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అరాచకాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో.. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సజ్జల, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఎస్టేట్ భూములకు సంబంధించి రీ-సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. కడప నగర శివారులోని సీకేదిన్నె మండలంలోని వందల ఎకరాల భూములను సర్వే చేయాలని, అందులో అక్రమాలు, ఆక్రమణలు ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. దాంతో.. కడప జిల్లా యంత్రాగం సజ్జల భూముల సర్వేకు సిద్ధమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున భూములను కలుపుకున్నారనే ఆరోపణలపై విచారణ చేయనున్నారు.
వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలంలో చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పక్కన సజ్జలకు భారీ ఎత్తున భూములు ఉన్నాయి. అయితే.. తన వాస్తవ భూముల కంటే ఆక్రమించుకున్న భూములే ఎక్కువగా ఉన్నాయని చాన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలున్నాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ప్రభుత్వ, అటవీశాఖ భూముల్ని ఆక్రమించుకున్నారని అంటున్నారు. దీనిపై టీడీపీ, జనసేనా నేతలు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు.. అధికారంలో ఉండడం, అటవీ శాఖకు ఏకంగా జనసేనా అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉండడంతో.. సజ్జలపై ఆగమేఘాల మీద యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. ఇప్పటికే.. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో ఇప్పటికే.. ఆయనపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సజ్జల సైతం హైకోర్టు ఆదేశాలతో ఇరుకున పడ్డారు.
గతంలో ఓసారి నిర్వహించిన భూముల సర్వేలో సజ్జల కుటుంబానికి ఉన్న మొత్తం 146 ఎకరాల భూముల్లో 55 ఎకరాల వరకు అటవీ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం అతిపెద్ద నేరం.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని సజ్జల అన్నింటినీ అధికారికంగా అనుభవించేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వివిధ సర్వే నంబర్లలోని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala), ఆయన కుటుంబం సభ్యుల భూములపై సమగ్ర విచారణ ప్రారంభమైంది. గతంలో అటవీ భూములను ఆక్రమించి, వాటిని తన భూములతో కలిపి, సజ్జల ఎస్టేట్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై సజ్జల, ఆయన కుటుంబానికి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు నోటీసులు అందించడంతో.. ఆయన కోర్టును ఆశ్రయించారు. తన భూముల్లో సర్వేను నిలిపి వేయాలని, తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని తెలిపారు. ఈ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. భూముల ఆక్రమణపై సర్వే చేసే అధికారం అధికారులకు ఉంటుందని తెలిపింది.
సజ్జల ఆక్రమించారని చెబుతున్న భూముల సర్వే కోసం రెవెన్యూ, అటవీ శాఖల సర్వే బృందాలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు.. సంబంధిత భూముల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా..సజ్జల కుటుంబ సభ్యులైన సజ్జల సందీప్ రెడ్డి 71.49 ఎకరాలు, సజ్జల జనార్దన్ రెడ్డి 16.85 ఎకరాలు, వై.సత్య సందీప్ రెడ్డి 21.46 ఎకరాలతో సహా సజ్జల విజయ కుమారి తదితరులకు మొత్తం 146.75 ఎకరాల భూమి ఉన్నట్లు లెక్కించారు. వీరందరికీ ఒకేచోట భూములుండగా.. ఇందులో దాదాపు 55 ఎకరాల వరకు ప్రభుత్వ, అటవీ భూములను కలుపుకున్నట్లుగా గతంలో తేల్చారు