దాదాపు రూ.8 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక కేటాయింపులు చేసింది. వాటిలో చదువులో ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం ఉచిత స్కూటీ పథకానికి కేటాయింపులు చేసింది. దీంతో.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదువుతూ, మంచి మార్కులు సాధించిన విద్యార్థినులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా స్కూటీని అందించనుంది. 2022 లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో యోగీ ఆదిత్యానాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రకటించిన ఎన్నికల హామీల్లో ఈ పథకం ఓ భాగం. దీంతో.. ఎన్నికల హామిని అమలుచేసేందుకు యూపీ సీఎం యోగీ అదిత్యానాథ్ నిర్ణయించారు. దాంతో..ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా.. తన బడ్జెట్ ప్రతిపాదనలో ఈ స్కూటీ పంపిణీ పథకానికి నిధులు కేటాయింపులు చేశారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఆడపిల్లలు, కాలేజీలకు సులువుగా వెళ్లివచ్చేలా స్కూటీలను అందిస్తామంటూ యోగీ అదిత్యా నాథ్ ప్రకటించారు. ఆమేరుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయింపులు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని తెలిపిన ప్రభుత్వం.. మెరిటోరియస్ ఆడపిల్లలకు స్కూటీని అందించే పథకానికి మహారాణి లక్ష్మీ బాయి పేరు పెట్టినట్లు వెల్లిడించారు.
2022 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రకటించిన లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్రలో ఈ వాగ్దానం చేశారు. ఈ పథకం లక్ష్యం ప్రతిభ చూపే బాలికలు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు చెందిన ఆడపిల్లలను కాలేజీ చదువులకు ప్రోత్సహించడమే అని యోగీ వెల్లడించారు. ప్రభుత్వం అందించే స్కూటీ కారణంగానైనా.. చదువుల్ని మధ్యలోనే నిలిపివేయకుండా.. ధైర్యంగా కాలేజీలకు వెళ్లివస్తారంటూ పేర్కొన్నారు.
అర్హతలు ఏంటంటే..
ఈ స్కూటీ పథకాన్ని అందుకోవాలి అంటే దరఖాస్తు చేసుకునే విద్యార్థి కచ్చితంగా ఉత్తరప్రదేశ్ నివాసి అయి ఉండాలని, ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించి ఉండాలని అధికారులు తెలిపారు. ఆ మార్కుల మెరిట్ ఆధారంగానే స్కూటీలు అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే.. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మంచి పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థినిల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదని స్పష్టం చేశారు. అంటే.. మధ్యతరగతి, పేద కుటుంబాల్లోని పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం, గ్రాడ్యూయేషన్ స్థాయిలో ఉత్తమంగా రాణించేలా ప్రోత్సహించేందుకే అని తెలిపుతున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలపైనా అధికారులు స్పష్టతనిచ్చారు. విద్యార్థునిలు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటుగా వయస్సు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. అలాగే.. 10వ, 12వ మార్కుల షీటును ఈ పథకం కింద అప్లై చేసుకునేటప్పుడు అధికారులకు అందజేస్తే.. అందులోని మార్కులను నమోదు చేసుకుని, మెరిట్ జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే.. అప్లై చేసే విద్యార్థులంతా తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలు అందజేయాలని తెలుపుతున్నారు. అధికారులకు దరఖాస్తును సమర్పించి, రసీదును భద్రంగా ఉంచుకోవాలని తెలిపిన అధికారుల.. ప్రభుత్వం డేటా వెరిఫికేషన్ తర్వాత మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందులో పేరున్న ద్యార్థినులకు ఉచితంగా స్కూటీ అందజేయనున్నట్లు తెలిపారు.