రాజ లింగమూర్తి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇంతకీ ఆయనను చంపిందెరు? పగబట్టి చంపారా, రాజకీయ హత్యా? అధికార పార్టీ ముమ్మాటికీ రాజకీయ హత్యేనని చెబుతోంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ కేసు సీఐడీకి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజలింగం హత్యపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది రాజ లింగమూర్తి హత్య కేసు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి ఆయన. బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి ముమ్మాటికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు రాజలింగమూర్తి. దీంతో భూపాల్‌పల్లి న్యాయస్థానంలో కేసు వేశారు. న్యాయస్థానం మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
అంతలోనే రాజలింగమూర్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులో వచ్చిన కొందరు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చంపేశారు. స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ప్రభుత్వం వెర్షన్ ఏంటి?
ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. రాజలింగమూర్తి హత్యను ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి,అవినీతి పై ప్రశ్నించి కేసులు వేసినందుకే లింగమూర్తిని హత్య చేశారని వ్యాఖ్యానించారు. కొన్ని నెలల కిందట ఇదే కేసు నడుస్తుండగా సంజీవరెడ్డి అనే న్యాయవాది కూడా అనుమానస్పదంగా చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు సదరు మంత్రి.
ఈ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. దీని వెనుక ఎవరున్నారో, హత్య ఎందుకు చేశారో నిజాలు అన్నీ బయట పడతాయన్నారు. భూపాలపల్లిలో హత్యా రాజకీయాలకు ఎలాంటి తావు ఉండకూడదన్నారు. తన లక్ష్యం, మా ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని చెప్పుకొచ్చారు.
రాజలింగమూర్తి హత్యను ఖండించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల అవినీతిపై ప్రశ్నించిన అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య జరిగిందన్నారు. కాళేశ్వరం అక్రమాలపై మొదటి నుంచి పోరాడుతున్న లింగమూర్తి హత్య చాలా బాధాకరమన్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని వక్కానించారు.
రాజలింగం భార్య ఏమంటోంది?
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తన అనుచరుల చేత చంపించారని అన్నారు రాజలింగమూర్తి భార్య. తన భర్తను చంపమని కేటీఆర్, వెంకటరమణా రెడ్డికి చెప్పారన్నది ఆమె వెర్షన్. వెంకటరమణ రెడ్డి, సంజీవ్ తోపాటు మరికొందరు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. కాళేశ్వరం, మేడిగడ్డ అక్రమాలపై తన భర్త కేసు వేసినందుకే చంపించారు ఆవేదన వ్యక్తం చేశారు రాజలింగమూర్తి భార్య.
ఈ హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. భూ వివాదాల నేపథ్యంలో లింగమూర్తి స్నేహితుడే ఈ హత్యకు ప్లాన్ చేశాడని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. సంజీవ్, హరిబాబు, కొమురయ్య, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.