ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు? మాజీ సీఎం కుమారుడి కుర్చీ లభిస్తుందా? బీజేపీ హైకమాండ్ మహిళలకు ఛాన్స్ ఇస్తుందా? ఇప్పటివరకు రేసులో అరడజను మంది నేతలున్నారా? కమలనాథుల మదిలో ఏముంది? చివరివరకు గోప్యంగా ఉంచుతారా? నేతల్లో టెన్షన్ కంటిన్యూ అవుతుందా? బీజేఎల్పీ సమావేశం వరకు ఈ సస్సెన్స్ కొనసాగుతుందా? అవుననే అంటున్నారు నేతలు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా నుంచి రావడంతో ఢిల్లీ కొత్త సీఎం ఎవరనేది తేల్చే పనిలో నిమగ్నమైంది బీజేపీ హైకమాండ్. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆశావహులు బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హస్తిన పీఠం దక్కడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
గతంలో ఢిల్లీ బీజేపీలో గ్రూపులు రాజకీయాలు నడిచేవి. వాటికి ఏ మాత్రం తావివ్వ కుండా అడుగులు వేస్తోంది. పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కోసం అభ్యర్థుల పూర్వపరాలను పరిశీలిస్తోందట బీజేపీ. ముఖ్యంగా సంఘ్ నుంచి వచ్చినవారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది.
నార్మల్‌గా సోమవారం సాయంత్రం బీజేఎల్పీ సమావేశం నిర్వహించాలని భావించారట బీజేపీ పెద్దలు. చివరి సమయం లో బుధవారం నాటికి వాయిదా పడింది. బీజేఎల్పీలోనే సీఎం అభ్యర్థిని ప్రకటించనుంది. గతంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇదే గోప్యత పాటించారు కమలనాథులు. ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవ్వాలన్నది పార్టీ ఆలోచనగా నేతలు చెబుతున్నారు.
శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు. సమావేశంలో కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవనున్నారు. ఇక సీఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లను నియమించింది అధిష్ఠానం. ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి,మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండవచ్చని పార్టీ వర్గాల మాట. వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. దాదాపు 12,000 మంది హాజరవుతారని అంచనా వేస్తోంది.
రేసులో నేతలు వీరే
ఇక ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీ ఫార్ములానే
వీరిని కాకుండా యూపీలో అనుసరించిన ఫార్ములాను తెరపైకి తెస్తుందా అనే వార్తలూ లేకపోలేదు. ఎంపీగా ఉన్న యోగిని యూపీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి అందరికీ షాకిచ్చింది మోదీ టీమ్. ఛత్తీస్‌ఘడ్, ఒడిషాలోని అదే ఫార్ములాను ఫాలో అయ్యిందని గుర్తు చేస్తున్నారు. రేపటి రోజున ఢిల్లీలో అదే పద్దతిని అనుసరించవచ్చని అంటున్నారు కొందరు బీజేపీ పెద్దలు.
రంగంలోకి దిగిన ఆప్
మరోవైపు ఢిల్లీకి ముఖ్యమంత్రిని నియమించడంలో బీజేపీ డిలే చేయడంపై విమర్శలు ఎక్కుపెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. బహుశా ఆ పార్టీలో అంతర్గత వర్గ పోరు ఉందని ఆరోపించింది. పాలన కంటే అధికార పోరాటాలకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్. ఆ పార్టీ దృష్టి ఎప్పుడూ పాలనపై లేదన్నారు.