తిరుమల లడ్డూ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో విస్తు పోయే విషయాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. కీలక స్థానాల్లో నిలిచిన ఇద్దరు మాజీ లపైన ఫోకస్ చేసారు. వీరికి నోటీసు లు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ ఇద్దరు మాజీ ప్రముఖుల పైన లుకౌట్ నోటీసుల జారీకి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. లడ్డూ కేసులో ఈ ఇద్దరి విచారణ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారనుంది.
ఇద్దరి పాత్రపై అనుమానాలు
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ పైన సిట్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులకు ముఖ్యమైన ఆధారాలు అందినట్లు సమాచారం. ఈ వ్యవహారం లో గతంలో టీటీడీలో కీలక స్థానంలో పని చేసిన ఒక ముఖ్య అధికారి.. అదే విధంగా ఒక పాలక మండలి సభ్యుడు సూత్రధారులుగా భావిస్తున్నారు. గతంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరి పైన లుకౌట్ నోటీసులు జారీకి రంగం సిద్దం అయినట్లు సమాచారం. వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన ఆ ముఖ్య అధికారి పాత్ర పైన సిట్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
లుకౌట్ నోటీసులు
అదే విధంగా పాలకమండలిలో కీలకంగా పని చేసిన వ్యక్తి పాత్ర పైన విచారణ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరా ఒప్పందాల్లో ఇప్పటికే సిట్ అధికారులు వీరిద్దరి పాత్రను ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. ఈ కేసులో ఆ ఇద్దరు తప్పిం చుకునే వీలులేకుండా ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో టీటీడీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పాలకమండలి సభ్యుడొకరు నాటి టీటీడీ ముఖ్య అధికారితో ఉన్న సన్నిహిత సంబంధాల పైన సిట్ ఫోకస్ చేసింది. ఆ మాజీ పాలక మండలి సభ్యుడే ఈ నెయ్యి ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు.
ఖాతాల పరిశీలన
దీంతో, ఆ కీలక సభ్యుడు.. మాజీ అధికారికి సంబంధించి ఖాతాలు – లావాదేవీలను సిట్ అధికా రులు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ ఇద్దరి నుంచి డెయిరీల యాజ మాన్యం.. అధికారులతో చేసిన ఫోన్ సంభాషణల కాల్ డేటాను సిట్ విశ్లేషిస్తున్నట్లు సమాచారం. నెయ్యి నాణ్యత పైన ఫిర్యాదులు వచ్చినా.. ఆ మాజీ పాలక మండలి సభ్యుడు టీటీడీ అధికారుల పైన ఒత్తిడి తెచ్చినట్లు విచారణలో గుర్తించారని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు ఈ ఇద్దరి కీలక వ్యక్తుల విచారణ కు సిట్ సిద్దమైంది. ఇక.. కల్తీనెయ్యి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో సిట్ విచారణ కీలక దశకు చేరటంతో.. త్వరలోనే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందనేది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.