జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Assembly elections) రెండో విడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటలతో ప్రశాంతంగా ముగిసింది. 56 శాతం పోలింగ్ నమోదైనట్టు శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమ్మూకశ్మీర్ ఎలక్టోరల్ అధికారి పీకే.పోల్ తెలిపారు. హజ్రత్ బల్, రియాసీలో వంటి కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నడుస్తున్నందున పోలింగ్ శాతం స్వల్పంగా పేరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని చోట్ల వివాదాల వంటి స్వల్ప ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ మొత్తంమీద ప్రశాంతంగానే పోలింగ్ ముగిసిందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని వివరించారు.
కాగా, జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవి సీటులో అత్యధికంగా 75.29 శాతం పోలింగ్ నమోదు కాగా, పూంచ్-హవేలీలో 72.71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్‌లోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖాన్‌సాహెబ్ సెగ్మెంట్‌లో 67.70 శాతం, కంగన్ (ఎస్టీ)లో 67.60, చరర్-ఇ-షరీఫ్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడత ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జేకేపీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమిద్ కర్రా, జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఉన్నారు. కాగా, మూడో విడత పోలింగ్‌లో భాగంగా 40 సీట్లకు అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి.