- మణిపూర్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించడంతో మణిపూర్‌లో శాంతి భద్రతల విషయంలో కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా
మణిపూర్ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. ఇప్పటి వరకు మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా ఉందని ఈ సందర్భంగా బీరేన్ సింగ్ పేర్కొన్నారు.
బీరేన్ సింగ్ వెంట బీజేపీ అధ్యక్షురాలు ఎ శారద, బీజేపీ ఈశాన్య మణిపూర్ ఇంఛార్జ్ సంబిత్ పాత్ర, మరో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత కొంత కాలంగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది ఇలావుండగా, కాంగ్రెస్ పార్టీ బీరేన్ సింగ్‌పై ఫిబ్రవరి 10 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే బీరేన్ సింగ్ ఫిబ్రవరి 8న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు అగ్రనేతలు కలిశారు. అగ్రనేతల భేటీ అనంతరం బీరేన్ సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
దాదాపు గత రెండున్నరేళ్ల నుంచి మణిపూర్ రాష్ట్రంలో మెజార్టీ మైటీ, మైనారిటీ కుకీ వర్గం మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ అప్పుడప్పుడు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి సీఎం బీరేన్ సింగ్ పై ప్రతిపక్షాలతోపాటు బీజేపీలోనూ కొంత అసమ్మతి నెలకొంది. హింసాత్మక ఘటనలను అరికట్టడంలో సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీరేన్ సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.