రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బుధవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకులు ఇండో-పసిఫిక్, వివిధ ప్రపంచ వేదికలు, తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. విస్తృత స్థాయి చర్చల అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మంచి ఫలితాలను అందించేలా నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 10-12 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన అనేక ముఖ్యమైన ఒప్పందాలు, భాగస్వామ్యాలతో ముగిసింది. ఈ పర్యటన భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు(AI), అణుశక్తి, ఆవిష్కరణ వంటి రంగాలలో సహకారం గురించి చర్చలు జరిగాయి.
కీలక ఒప్పందాలు, ప్రకటనలు
1.కృత్రిమ మేధస్సుపై భారత్-ఫ్రాన్స్ ఉమ్మడి ప్రకటన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో భారత్, ఫ్రాన్స్ ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ఏఐ పరిశోధన, ఆవిష్కరణ, డేటా భద్రత రంగాలలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి విధాన రూపకల్పనలో రెండు దేశాలు సహకరించుకుంటాయి.
2. ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ 2026 లోగో ఆవిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంయుక్తంగా “ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026” అధికారిక లోగోను ఆవిష్కరించారు. రెండు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్టార్టప్ ల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ లోగో ఆవిష్కరించబడింది.
3. అణుశక్తిలో సహకారం
అణుశక్తిలో సహకారం అందించుకోవడానికి ఓ ప్రకటనపై ఇరు దేశాలు సంతకం చేశాయి. అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్లు(AMR), స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు(SMR) ఏర్పరుచుకోవడానికి రెండు దేశాలు ఓ ప్రకటనపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం పరిశుభ్రమైన, స్థిరమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఇరు దేశాలను భాగస్వామ్యం చేసింది.
4. అణు శాస్త్ర సాంకేతిక రంగంలో సహకారం
భారత అణుశక్తి విభాగం(DAE), ఫ్రాన్స్ కు చెందిన సీఈఏ(కమిషన్ ఆన్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్) ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం భారతదేశ గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్టనర్ షిప్(GCNEP), ఫ్రాన్స్ ఇన్ స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య పరిశోధన, శిక్షణను ప్రోత్సహించనున్నారు.
సోమవారం ఫ్రాన్స్ కు చేరుకున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఫ్రాన్స్ చేరుకున్నారని, మాక్రాన్ తో కలిసి ఆర్టిఫిషియయల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కు కూడా అధ్యక్షత వహించారని తెలిసిందే. ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటించడం ఇది ఆరోసారి. 2024 జనవరిలో భారత 75వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత పర్యటన తర్వాత ఇది జరిగింది. ఇద్దరు నాయకులు అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ సౌకర్యాన్ని కూడా సందర్శించారు.
టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంపై చర్చ
భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల తమ బలమైన నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. గత 25 సంవత్సరాలుగా ఇది బహుముఖ సంబంధంగా నిరంతరం అభివృద్ధి చెందిందని గుర్తించారు. ప్రధానమంత్రి మోడీ మంగళవారం సాయంత్రం ఫ్రెంచ్ అధ్యక్ష విమానంలో పారిస్ నుంచి మార్సెయిల్ చేరుకున్నారు. ఇక్కడ ద్వైపాక్షిక సంబంధాల గురించి.. ప్రధాన ప్రపంచ, ప్రాంతీయ సమస్యలను చర్చించారు. మార్సెయిల్ లో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. రక్షణ, పౌర అణుశక్తి, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలలో సహకారాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలను కూడా వారు చర్చించారు.
10 భారతీయ స్టార్టప్‌లకు ఆతిథ్యం
ఫ్రెంచ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ Fలో 10 భారతీయ స్టార్టప్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒక ఒప్పందంపై సంతకం చేయబడింది. అదే సమయంలో అధునాతన మాడ్యులర్ రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లపై భాగస్వామ్యాలను స్థాపించడంపై ఓ ఒప్పందం జరిగింది.