AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయసాయిరెడ్డి ప్లేస్‌లో పేర్ని నాని.. జగన్ కీలక నిర్ణయం..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీకి సంబంధించి కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఓటమి తర్వాత గతంలో చేసిన తప్పులన్ని కూడా సరిచేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల విజయవాడ నగర కార్పోరేటర్లతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎంత పెద్ద కూటములు వచ్చినా.. ఏం చేసినా, మన బలం, ప్రజల మద్దతు మనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాత 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. అయితే 40 శాతం ఓటింగ్ దక్కిందన్న ధీమా జగన్‌లో వ్యక్తమవుతుంది.

 

కాగా వైసీపీ ఉత్తరాంధ్రలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పార్టీ వివిధ జిల్లాలలో ఇంఛార్జిలను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రీజనల్ కో ఆర్డినేటర్లను కూడా నియమించింది. మొన్నటి వరకు ఉత్తరాంధ్ర ఇంఛార్జిగా, వైసీపీ రాజ్యసభ ఎంపీగా విజయసాయి రెడ్డిని నియమించారు. అయితే ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం స్వీకరించారు. దీంతో ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ పోస్టును ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై వైసీపీలో జోరుగా చర్చ సాగుతోందట.

 

సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాణకు ఈ పదవి ఇస్తారనుకున్నారు. ఇక ఉత్తరాంధ్రలో కీలకనేతగా. పార్టీ ఏదైనా.. విధేయుడిగా ఉంటారనే పేరుంది. ప్రత్యర్థుల ఎత్తులను.. చిత్తు చేయటంలో ఆయనకు ఆయనే సాటి. కానీ బొత్స ఇప్పటికే శాశనమండలిలో ప్రతిపక్ష నేతగాఉన్నారు. అలాగే గోదావరి జిల్లాల వైసీపీ కో ఆర్జినేటర్‌గా ఉన్నారు.

 

కాబట్టి ప్రస్తుతం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించడంకంటే.. వేరే వాళ్లకి ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. “ఈ తరుణంలో వైసీపీ మాజీ మంత్రి మచిలీపట్నం నాయకుడు పేర్ని నానీకి ఈ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.” వైసీపీలో ఆయనో ఫైర్ బ్రాండ్. ఫ్యాన్ పార్టీని విమర్శిస్తే చాలు.. వాళ్లూ.. వీళ్లూ తేడా లేకుండా విరుచుకుపడేవారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉండగా.. ఓ వెలుగువెలిగిన నేత.. సైలెంట్ అయ్యారు. ఇటీవల రేషన్ రైస్ స్కామ్‌లో కేసులో ఇరుకున్నారు. వాటితో ఆయన సతమతమవుతున్నారు.

 

అయితే ఆయన మళ్లీ లైన్‌లోకి వస్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ నాయకులు ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. పేర్ని నానీ కో ఆర్డినేటర్‌గా చేస్తే ఉత్తరాంధ్రలో కొంత ఊపు వస్తుందని భావిస్తున్నారట. ఇక వైసీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా జగన్‌ని అంటిపెట్టుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి, ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి ప్లేస్‌ని ఆయన రీప్లేస్ చేస్తే మాత్రం.. ఖచ్చితంగా అక్కడ పార్టీకి సంబంధించిన అంశాలపైన, ప్రభుత్వంపై గట్టిగా గళమెత్తే ఒక వాయిస్‌గా ఉంటారని జగన్ భావించారట. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్థానాన్ని బర్తీ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు బొత్స సత్యనారాయణకు కూడా ఈ నియామకం ఆమోదయోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

 

కాగా 2016 నుంచి 2022 వరకూ విజయసాయిరెడ్డి రీజనల్ కో-ఆర్డినేటర్‌‌గా ఉన్నారు. ఆ తర్వాత 2024లో వైవీ సుబ్బారెడ్డి చేశారు. మళ్లీ విజయసాయి రెడ్డికే ఇచ్చారు కానీ.. ఆయన ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే ప్రతిసారీ వేరే సామాజిక వర్గానికి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉన్నవారికి ఇస్తే బాగుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇప్పుడు పేర్ని నాని నియామకం ఆ విధంగానే జరిగిందా అన్న చర్చ జోరుగా ప్రచారం అవుతోంది.

 

ఇక వైసీపీ అధినాయకత్వం ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నేతలతో.. ఫిబ్రవరి 12న కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే పేర్ని నాని నియామకం ఉంటుందని చెబుతున్నారు. మరి చూడాలి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో..

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10