AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్‌కు విజయమ్మ, షర్మిల కౌంటర్..!

సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతేడాది జగన్ వేసిన పిటిషన్‌పై ఆన్ లైన్‌లో కౌంటర్ చేశారు తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల. నేరుగా కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని విజయమ్మ కోరడంతో ట్రైబ్యునల్ తదుపరి విచారణ మార్చి ఆరుకి వాయిదా వేసింది. ఇంతకీ విజయమ్మ, షర్మిల ప్రస్తుతం కౌంటర్ లో ప్రస్తావించిన అంశాలను పరిశీలిద్దాం.

 

అసలు పిటిషన్ వివరాల్లోకి ఓసారి వెళ్దాం. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో తనకు, తన భార్య భారతి పేరు మీద 51.01 శాతం వాటా ఉందని పిటిషన్ వేశారు జగన్. భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019, ఆగస్టు 31న ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తనకు తెలియకుండా, సంతకాలు లేకుండా షేర్లు బదిలీ చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కంపెనీ చట్టానికి విరుద్దమన్నది జగన్ ప్రస్తావన. షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51 శాతం షేర్లు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

 

జగన్ వేసిన పిటిషన్‌పై ఆన్ లైన్‌లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, భారతి ప్రస్తావించిన అంశాలు ముమ్మాటికీ నిరాధారమన్నారు. ఇలాంటివి న్యాయ సమీక్ష ముందు నిలబడవన్నారు. కంపెనీ వాటాలను చట్టబద్ధంగా గిఫ్ట్‌గా ఇస్తూ చేసుకున్న ఒప్పందంలో జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ జోక్యం తగదన్నారు.

 

కుటుంబ వివాదాలు ట్రైబ్యునల్ పరిధిలోకి రావన్నారు. తనకు తెలీకుండా సరస్వతి పవర్ షేర్లను తన తల్లి, చెల్లి బదిలీ చేశారన్న వాదనను తప్పుబట్టారు. కేవలం రాజకీయ కారణాలతోనే జగన్ ఎన్ సీఎల్‌టీలో తప్పుడు పిటిషన్ వేశారని తెలియజేశారు విజయమ్మ, షర్మిల.

 

షేర్లు బదలాయింపు అంతా చట్ట ప్రకారమే జరిగిందన్నారు. ట్రైబ్యునల్ ను పక్కదారి పట్టేలా పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. తాము పొందు పరిచిన సాక్షాలను పరిశీలించిన తర్వాత తగిన ఆదేశాలు జారీ చేయాలని కౌంటర్ పిటిషన్ లో ప్రస్తావించారు.

 

ఇదిలావుండగా జగన్ వేసిన పిటిషన్ పై సోమవారం ట్రైబ్యునల్ లో విచారణ జరిగింది. జగన్ తరపు న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు. కౌంటర్లు దాఖలు చేయాలని గతేడాది సెప్టెంబరులో నోటీసులు జారీ చేసినప్పటికీ, ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని ప్రస్తావించారు. అందరూ కౌంటర్ దాఖలు చేస్తే.. తాము రిజాయిండర్ దాఖలు చేస్తామన్నారు.

 

విజయమ్మ, షర్మిల తరపున అడ్వకేట్ విశ్వరాజ్ తన వాదనలు వినిపించారు. ఆన్ లైన్ లో తాము కౌంటర్లు దాఖలు చేశామని, ఒకటీ లేదా రెండు రోజుల్లో నేరుగా ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను మార్చి ఆరుకు వాయిదా వేసింది. మొత్తానికి విజయమ్మ, షర్మిల కౌంటర్ దాఖలు చేయడంతో ఓ పనైపోయింది. మరి ట్రైబ్యునల్ తీర్పు ఎవరి వైపు వస్తుందోనన్న ఆసక్తి వైఎస్ఆర్ అభిమానుల్లో నెలకొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10