దేశంలో ఆర్ధిక మందగమన పరిస్ధితుల నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్దిక మంత్రి వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా 12 లక్షలకు పెంచడం ద్వారా మధ్యతరగతికి భారీ ఊరటనిచ్చారు. అలాగే కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్ లను మార్చారు. అదే సమయంలో కొత్తగా ఆదాయపు పన్ను బిల్లు తీసుకొస్తామని ప్రకటన చేశారు. అన్నట్లుగానే ఇవాళ కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సిద్దమవుతున్నారు. చివరి నిమిషంలో మార్పు ఉంటే తప్ప ఇవాళ లోక్ సభలో ఈ బిల్లు తీసుకురావడం ఖాయమైంది. అయితే ఇందులో ఏముందనే చర్చ వేతన జీవుల్లో మొదలైంది. దేశంలో ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళీకృతం చేయడం ఈ బిల్లు లక్ష్యం. అయితే ఇందులో ఎలాంటి కొత్త పన్ను భారాలు ఉండకపోవచ్చని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. అయితే చట్టాన్ని పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువ చేసేందుకు పలు మార్పులు తీసుకురానుంది.
మరోవైపు తాజాగా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో పాటు అమెరికా నుంచి భారీగా వలసదారుల్ని స్వదేశానికి బేడీలు వేసి మరీ పంపేస్తుండటంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. అలాగే శ్రీలంక నేవీ భారతీయ మత్స్యకారులను అరెస్టు చేయడంపైనా విపక్షాలు కేంద్రాన్ని ఇరుకునపెట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి సిద్దమవుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి భాగం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది.