గుంటూరు నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర నాని పేరును ప్రకటించింది. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ్యులు నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్, కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రని మేయర్ అభ్యర్థిగా నిర్ణయించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా2019-24 వరకు ఆయన వ్యవహరించారు. పార్టీకి బలోపేతానికి ఎంతో కృషి చేశారు. రెండు దశాబ్ద కాలంలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి మొదలు రవీంద్ర చేసిన సేవలకు పార్టీ హైకమాండ్ గుర్తించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రవీంద్ర పేరు ఓకే అయినట్టు ప్రచారం సాగింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో గళ్ళ మాధవికి ఆ సీటు కేటాయించారు. ఆమె గెలుపుకు తీవ్ర కృషి చేశారు.
టిడిపి జోన్ 5 ఇన్చార్జిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మార్చి 18తో ప్రస్తుత మేయర్ మనోహర్ నాయుడు పదవీకాలం నాలుగేళ్లు పూర్తి కానుంది. మరో ఏడాది ఉండగా ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టందుకు కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో నాలుగేళ్ల వరకు మేయర్ పై ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టరాదని బిల్లు తెచ్చిన విషయం తెల్సిందే.
ఇటీవల కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆరు స్టాండింగ్ కమిటీలను టీడీపీ దక్కించుకుంది. అందులో కోవెలమూడి కీలకపాత్ర పోషించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా టీడీపీ ప్రజాప్రతినిధులే ఉండటం మరో కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో మేయర్ పీఠం కూటమిని కూటమి దక్కించుకోవడం తధ్యమని అంటున్నారు.
రీసెంట్‌గా ఏపీలో కీలకమైన నగర కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవులను టీడీపీ దక్కించుకున్న విషయం తెల్సిందే. రేపో మాపో విశాఖ మేయర్ సీటుపై టీడీపీ కన్నేసింది. అక్కడ మేయర్ అభ్యర్థి ఎవరికి కేటాయించాలన్న దానిపై మంతనాలు జరుగుతున్నాయి. రేపో మాపో దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకోవచ్చన్నది టీడీపీ నేతల మాట.