తెలంగాణపై ఫోకస్ చేసింది జనసేన పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. ఈ క్రమంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ అప్పుడే మొదలైపోయింది.
తెలంగాణలో ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు. అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ జనసేనకు గుర్తు కేటాయింపుపై నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగేందుకు జనసేన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి గ్లాసు సింబల్ కేటాయించిందని అంటున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తు మాత్రమే జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవల్లో కేడర్‌ను పెంచుకునేందుకు జనసేన వేసిన ఎత్తుగడగా కొందరు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే వీలు ఉంటుందన్నది ఆ పార్టీలో కొందరి నేతల మాట.
దీనికితోడు రోజురోజుకూ బీఆర్ఎస్ మరింత బలహీనంగా తయారవుతోంది. ప్రజల్లోకి ఆ పార్టీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గెలిచిన కొద్దిమంది నేతలు రాజధానిలో ఉంటున్నారు. ఆ రాజకీయ శూన్యతను భర్తీ చేసే పనిలో జనసేన పడినట్టు చెబుతున్నారు. అదే జరిగితే కారు పార్టీకి మరిన్ని కష్టాలు ఖాయమనే వాదన సైతం లేకపోలేదు.
ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు విషయానికొస్తే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కూటమి పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు గుప్పుమన్నాయి. ఆ విషయం ఎంతవరకు వచ్చిందనేది కాసేపు పక్కన బెడదాం. రానున్న రోజుల్లో కూటమి స్పీడ్ పెరిగితే కారు పర్మినెంట్‌గా షెడ్‌కు వెళ్లడం ఖాయమనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
కూటమికి చెందని కొందరు నేతల మాటల ప్రకారం.. తెలంగాణలో బీజేపీ నేతలు న్నారని, కాకపోతే గ్రౌండ్ స్ఠాయిలో కేడర్ లేదని అంటున్నారు. ఇక టీడీపీ కేడర్ బలంగా ఉంది. కాకపోతే పేరున్న నేతలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో జనసేన కొత్త స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు.