AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా..? ఎర్రకోటపై కాషాయం జెండా ..?

ఇంకొన్ని నిమిషాల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతోన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఢిల్లీతో పాటు తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ఓట్లనూ లెక్కిస్తారు.

 

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. విస్తృత తనిఖీలను నిర్వహించిన తరువాతే వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తోన్నారు.

 

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

 

1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి.

 

ఈ దఫా ఈ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. బీజేపీ అబ్జల్యూట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సగటును 35 నుంచి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. ఇవి- ఎంత వరకు వాస్తవరూపాన్ని దాల్చుతాయనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది.

 

మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ, కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌ మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే- పార్టీని పొరుగు రాష్ట్రాలకు విస్తరించాలనుకునే ఆయన కల సాకారం కాకపోవచ్చు. ఢిల్లీ, పంజాబ్‌కే పరిమితం కావొచ్చు.

 

ముఖ్యమంత్రి అతిషి.. కల్కాజీ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అల్కా లంబా, రమేష్ బిధూరి ఏ స్థాయిలో ఆమెకు పోటీ ఇచ్చారనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది. జంగ్‌పురాలో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా బీజేపీకి చెందిన తర్విందర్‌ సింగ్‌ మార్వా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఫర్హాద్‌ సూరితో తలపడ్డారు. ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్ బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్‌పై షకూర్ బస్తీ నుంచి పోటీ చేశారు.

ANN TOP 10