AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎల్పీ మీటింగ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.

స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం, పార్టీ బలోపేతం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో పని చేయాలని సూచనలు చేశారు. గ్రామాల్లో పార్టీ బలాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయాలు సాధించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనన్నారు.

 

స్ఖానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం వేగవంతంగా పనులు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, వివిధ నిర్మాణాలకు అనుమతులు, నిధుల కేటాయింపు కోసం సంబంధిత మంత్రులను కలవాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా..బీసీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. బీసీ నాయకత్వాన్ని ముందుకు తేవడానికి.. వారికి అధికారంలో మద్దతుగా నిలిచేందుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నేతలు, కేడర్ ఒక్క తాటిపై నిలిచి పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడుతుందన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ విజయం కోసం పాటుపడాలని, గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

 

ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాలపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ సభలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10