సిల్క్ స్మిత .. ఒకప్పటి శృంగారతార. మత్తుకళ్లతో మనసులను కొల్లగొట్టిన నాయిక. ఆమెను ప్రధానమైన పాత్రగా చేసుకుని రచయితలు కథలు రాసుకున్నారు. ఆమె డేట్స్ కోసం ఆనాటి స్టార్ హీరోలు సైతం వెయిట్ చేశారు. అలాంటి ఆమె చనిపోయి చాలా కాలమే అయింది. అయినా ఆమెను గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంతగా ప్రభావితం చేయడం ఆమెకి మాత్రమే సాధ్యమైందని చెప్పచ్చు.
అలాంటి ఆమె గురించి సీనియర్ నటి ‘జయశీల’ ప్రస్తావించారు. తాజాగా ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఉండగా సిల్క్ స్మిత ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె స్పందిస్తూ .. “సిల్క్ స్మిత చాలా మంచి అమ్మాయి. నేను .. తానూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము. చాలా కష్టపడి పైకి వచ్చింది. ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఎవరైనా ఏదైనా అంటే తిరిగి ఏమీ అనేది కాదు. కానీ ఆ విషయాన్ని మరిచిపోకుండా మనసులో పెట్టుకునేది. తనని చులకనగా చూసిన హీరోల ముందే సెట్లో కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం ఆమెకే చెల్లింది” అని అన్నారు.
“సిల్క్ స్మిత ఒక వ్యక్తితో కలిసి ఉండేది. అతను ఆమె సంపాదించిందంతా లాగేసుకున్నాడు. అతని కొడుకుతో సిల్క్ స్మిత ప్రేమలో పడింది. ఆమె మరణానికి అది కారణమై ఉండొచ్చు. సిల్క్ స్మితకి పెళ్లి చేసుకోవాలనీ .. తల్లిని అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. పాపం ఆ కోరిక నెరవేరకుండానే ఆమె చనిపోయింది. సిల్క్ స్మిత .. ‘ఫటా ఫట్’ జయలక్ష్మి నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్లిద్దరూ చనిపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది” అని చెప్పారు.