ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉచిత రేషన్ పొందుతున్న వారికి షాక్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేఏవై) కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం చేసిన కేంద్రం.. ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని యోచిస్తోంది.
లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదంటే పాన్ నంబర్ వివరాలను వినియోగదారుల మంత్రిత్వశాఖలోని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్‌పీడీ).. ఆదాయపు పన్ను శాఖకు అందిస్తుంది. వారిలో ఎంతమంది ఐటీ కడుతున్నదీ లెక్క తేల్చి తిరిగి ఆ వివరాలను డీఎఫ్‌పీడీకి అందిస్తుంది. ఈ వివరాల ద్వారా లబ్ధిదారుని ఆర్థిక స్థాయిని నిర్ధారించి వారు అర్హులో, కాదో తేలుస్తారు. అనర్హులు అయితే కనుక ఉచిత రేషన్‌ను నిలిపివేస్తారు.