ఛాంపియన్స్ ట్రోఫీ ముందు బీసీసీఐ భారత ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీని తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ లో టీమిండియా ప్లేయర్లు ఈ కొత్త జెర్సీలోనే బరిలోకి దిగనున్నారు. ఇక కొత్త జెర్సీలో కొన్ని చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి.
పాత జెర్సీలో భుజం నుంచి చేతుల వరకు కాషాయం రంగు ఉండగా, కొత్త దానిలో భుజం భాగంలో భారత జాతీయ పతాకంలోని త్రివర్ణ రంగులను చేర్చారు. ఈ మార్పును భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక సందేశాన్ని తీసుకు వెళ్లే విధంగా రూపొందించారు. అలాగే జెర్సీ మరింత ఆకర్షణీయంగా కూడా మారింది.
కాగా, వన్డే జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీ ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, బీసీసీఐ పోస్టు చేసిన ఫొటోల్లో విరాట్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లంతా ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫొటో మాత్రం మిస్ అయింది. దీంతో నెట్టింట దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. కెప్టెన్ లేకుండా కొత్త జెర్సీ ఫొటోలు బయటికి రావడంపై హిట్‌మ్యాన్ అభిమానులు కన్నెర్ర చేస్తున్నారు.