కర్ణాటకలోని హావేరీ జిల్లా, హనగళ్ తాలూకాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆసుపత్రిలో గాయానికి చికిత్స చేసిన నర్సు, కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్ రాయడం వివాదాస్పదమైంది. తాను గత కొంతకాలంగా ఇలాగే చేస్తున్నానని ఆమె చెప్పడం గమనార్హం. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు.
జనవరి 14న ఏడేళ్ల బాలుడు గురుకిషన్ అన్నప్ప హోసమణి చెంపకు గాయం కావడంతో తల్లిదండ్రులు అతనిని అడూర్ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ నర్సు జ్యోతి గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ రాసింది. బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించగా, గత కొన్నేళ్లుగా తాను ఇలాగే చేస్తున్నానని, కుట్లు వేస్తే శాశ్వతంగా మచ్చలు వస్తాయని చెప్పింది. దీంతో వారు ఆ దృశ్యాన్ని వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన అధికారులు నర్సు జ్యోతిని తొలుత బదిలీ చేశారు. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. వైద్య విధానాల్లో ఫెవిక్విక్ వంటి వాటిని వాడకూడదని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.