ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ. 90 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్‍ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్‌కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సీఐడీ చీఫ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలో సిట్ పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్ బృందానికి ప్రభుత్వం పూర్తి అధికారాలను కల్పించింది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీని నియమించారు.