కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఈ నెల 10వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష జరగనుంది. ఈ రైతు నిరసన దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొననున్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఈ దీక్షను నిర్వహించనుంది.
బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన బీసీ డిక్లరేషన్ వందశాతం అబద్ధమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్లన్నీ బూటకమని ఎద్దేవా చేశారు. ఆయన తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదని అన్నారు.
నిన్నటి అసెంబ్లీ సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు అర్థమయ్యాయని కేటీఆర్ అన్నారు. ఏడాదికి పైగా పాలన చేస్తున్న ప్రభుత్వానికి ఏ అంశం పైనా స్పష్టత లేదని, బీసీ డిక్లరేషన్ పేరుతో అబద్ధాలు చెప్పిందని తేలిపోయిందని ఆయన అన్నారు. అసెంబ్లీలో సమర్పించిన డేటాపై ప్రభుత్వానికి ఏమాత్రం స్పష్టత లేదని విమర్శించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని నిన్నటితో తేలిపోయిందని ఆయన అన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుందని విమర్శించారు. కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలన్నీ బూటకమేనని తేలిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.