AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భవన నిర్మాణ అనుమతులకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు..

ఏపీలో భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే అనుమతులు ఇవ్వనున్నాయి. సీఆర్డీఏ మినహా అన్ని ప్రాంతాల్లో అనుమతులు జారీ చేసే అధికారాన్ని అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ప్రభుత్వం బదిలీ చేసింది.

 

300 చదరపు మీటర్లు మించని నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేశారు. అర్కిటెక్టులు, ఇంజినీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసేలా అవకాశం కల్పించింది. అలాగే లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్లు కూడా ఇంటి ప్లాన్‌ను ధ్రువీకరించి అప్ లోడ్ చేసే అవకాశం ఉంది. అయితే కేవలం నివాస భవనాలకు మాత్రమే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు పోర్టల్‌లో ప్లాన్ అప్‌లోడ్ చేసేందుకు నిబంధనలను సరళతరం చేసింది.

 

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా భవన నిర్మాణ అనుమతుల కోసం సెల్ఫ్ సర్టిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టారు. ఆన్ లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సంబంధిత భవనాల యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10