తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి హాజరుకావడం లేదంటూ, కాబట్టి ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని ‘ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ’ నేడు నోటీసులు పంపింది. శాసనసభలో ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని, అందువల్ల ఆయన శాసనసభ్యుడిగా కొనసాగే అర్హతను కూడా కోల్పోయారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, లేదంటే ప్రతిపక్ష నేతగా ఆయనను తొలగించాలని ఆయన అన్నారు. కేసీఆర్‌కు సమన్లు జారీ చేసి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో వివరణ కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసోసియేషన్ తరఫు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి… మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు.