సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడికి పాల్పడటంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. వైకాపా మైనార్టీ నాయకుడు జమీర్ భాజపాలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ సమక్షంలో సోమవారం జమీర్ తన అనుచరులతో భాజపాలో చేరనున్నారు.
ఈ నేపథ్యంలో జమీర్ అనుచరులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జమీర్ భాజపాలో చేరడాన్ని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జమీర్ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చింపివేయడంతో వివాదం మొదలైంది. ధర్మవరంలోని పల్లకి సర్కిల్ రోడ్డులో తెదేపా వర్గీయుల వాహనాలపై జమీర్ అనుచరులు దాడి చేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
పోలీసుల ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పలువురు తెదేపా నాయకులు గాయపడ్డారు. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.