ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఏపీకి పెట్టబడుల కోసం పలువురు ప్రముఖులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపుల పైన చంద్రబాబు చర్చలు చేయనున్నారు. ఏపీకి గేమ్ ఛేంజర్ గా చంద్రబాబు భావిస్తున్న కీలక ప్రాజెక్టు పైన ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
దావోస్ పర్యటన నుంచి చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఏపీకి కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న 2024-25 వార్షిక బడ్జెట్ లో కేటాయింపుల కోసం చర్చలు చేయ నున్నారు. అదే విధంగా నదుల అనుసంధానంలో భాగంగా ఏపీకి గేమ్ ఛేంజర్ గా చంద్రబాబు భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించ నున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దావోస్ నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశానికి అప్పాయింట్ మెంట్ కోరారు. ఆర్దిక, జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు అందించనున్నారు
చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సుమారుగా రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన మొత్తం ఇతర మార్గాల్లో సమీకరించవచ్చని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. తాజాగా అమిత్ షా ఏపీ పర్యటన సమయం లోనూ ఈ మేరకు చంద్రబాబు ప్రత్యేకంగా నివేదిక ఇచ్చారు. షా నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయింది. దీంతో, ఇప్పుడు ప్రధానితో సమావేశమై ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కోసం సీఎం చర్చించనున్నారు. అదే విధంగా ఇతర శాఖలకు సంబంధించి కేంద్ర నుంచి నిధులు రాబట్టే అంశం పైన ముఖ్యమంత్రి ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది. 25న తిరిగి చంద్రబాబు అమరావతికి రానున్నారు.