AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణకు కాబోయే బీజేపీ అధ్యక్షుడు ఎవరు..?

తెలంగాణకు కాబోయే బీజేపీ అధ్యక్షుడు ఎవరు? అధికార పార్టీ వ్యూహాలను తిప్పుకొట్టే నేత కోసం వడపోస్తుందా? ఈసారి బీసీకి ప్రాధాన్యత ఇవ్వనుందా? తొలుత ఈటెల పేరు వినిపించినా, ఎందుకు వెనక్కి వెళ్లింది? కాళేశ్వరం అవినీతి ఆయన మెడకు చుట్టుకుంటుందనే భయం వెంటాడుతుందా? అదే జరిగితే అధ్యక్షుడు ఎంపిక మరింత డిలే అవుతుందా? రామ్ అస్త్రం ఈసారి ఫలిస్తుందా? తెరపైకి వచ్చిన ఆ ముగ్గురెవరు? ఇవే ప్రశ్నలు చాలామంది కమలం కార్యకర్తలను వెంటాడుతోంది.

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత ఐదారుగు పేర్లు వినిపించినా చివరకు ముగ్గురు నేతలను ఫైనల్ చేసినట్టు పార్టీ వర్గాల మాట. రేసులో ఎంపీలైన ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరి పీఠం దక్కనుందనేది చర్చ అప్పుడే మొదలైపోయింది.

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేసేందుకు కొన్నాళ్లుగా కసరరత్తు చేస్తోంది ఆ పార్టీ. బీసీ కార్డుతో ముందుకెళ్లాలని భావించింది హైకమాండ్. ఈటెల వైపు మొగ్గు చూపినట్టు హస్తినలో ఓ వార్త హంగామా చేసింది. కాకపోతే ఆయనకు చిక్కు సమస్యలు లేకపోలేదు.

 

ఈటెల వామపక్షం నుంచి వచ్చిన నేతగా పేరుంది. ఆయనకు అధ్యక్ష పగ్గాలు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈటెల నియమిస్తే కషాయి కార్యకర్తలు, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న అభిప్రాయం లేకపోలేదు.

 

ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఆయన పేరు బయటకు వచ్చింది. రేపో మాపో ఆయన్ని కమిషన్ విచారిస్తుందన్న వార్తల నేపథ్యంలో హైకమాండ్ రిపోర్టు కోరడం జరిగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్‌లో కీలకంగా వ్యవహరించే బీజేపీ నేత రామ్‌మాధవ్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం.

 

ఎంపీ అరవింద్, రామచందర్ రావు కోసం ఆయన లాబీయింగ్ చేస్తున్నట్లు అంతర్గత సమాచారం. ఆ ఇద్దరు నేతలు పార్టీ భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఎవర్ని అధ్యక్షుడిగా నియమించినా బాగుంటుందని చెబుతున్నారట. రామ్ మాధవ్ మాట కచ్చితంగా హైకమాండ్ వింటుందని చెబుతున్నారు కొందరు నేతలు. చాలా రాష్ట్రాల్లో పార్టీ విజయం వెనుక వ్యూహాలు రచించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో రామ్‌మాధవ్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చివరకు వచ్చిన వేళ రామ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈటెల అనుచరులు కలవరపడుతున్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక మరింత డిలే కావచ్చన్న వార్తలు సైతం లేకపోలేదు. మొత్తానికి కొద్దిరోజుల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవన్నది తేలిపోనుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10