గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరడం పట్ల ఆ పార్టీ స్పందించింది. 2024 ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ట్రైక్‌రేట్‌కు ఇది గుర్తింపు అని పేర్కొంది. గాజు గ్లాస్ గుర్తు పార్టీ శాశ్వత ఎన్నికల చిహ్నంగా మారిందని వెల్లడించింది.
దశాబ్ద కాల జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గారి పోరాటానికి, గడచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయంతో చరిత్ర సృష్టించిన జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గాజు గ్లాస్ గుర్తును శాశ్వత చిహ్నంగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొంది.
సమాజంలో మార్పు కోసం పవన్ కల్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని పేర్కొంది. నేడు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జనసైనికుడికి, వీరమహిళకు, నాయకులకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయఢంకా మోగించింది.