కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలయిందని ఆయన అన్నారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయిందని… అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని చెప్పారు. ఇక కాలయాపనతో కాలం సాగదని… అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదని అన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
“ఈ దరఖాస్తుల దందా నడవదు. ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు. నమ్మించి చేసిన నయవంచనకు నాలుగు కోట్ల సమాజం ఊరుకోదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గ్రామ సభలు అట్టుడికాయి. ఇవి గ్రామసభలా… ఖాకీల క్యాంప్ లా?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు నిర్వహించారని కేటీఆర్ మండిపడ్డారు. పోలీసు పహారాలో గ్రామాలను నింపేసి గ్రామసభలను నిర్వహించారని దుయ్యబట్టారు. ‘మీరు చెప్పిన ప్రజా పాలన ఇదా? మీరు చెప్పిన ఇందిరమ్మ పాలన ఇదా? అని ప్రశ్నించారు. పోలీసుల నడుమ.. ఆంక్షల నడుమ.. పథకాలకు అర్హుల గుర్తింపట’ అంటూ ఎద్దేవా చేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే విధంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు.