నైని బొగ్గు గనుల ద్వారా ఈ సంవత్సరం మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క. సోమవారం ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్‌లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సు సందర్భంగా ఒరిస్సా రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాంజీతో డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఓ లేఖను సైతం ఆయనకు అందజేశారు. ఒరిస్సా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు ఒడిస్సా సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
నైని క్యాప్టివ్ బ్లాక్ అయినందున బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సరఫరా చేయాలి. జైపూర్ విద్యుత్ ప్లాంట్ నైనీ గని నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాజిస్టిక్స్‌లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ఒడిశాలోని నైనా బొగ్గు గని సమీపంలో పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్‌గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు, ఉత్పత్తి అయిన బొగ్గు లాభదాయకంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం అని ఒరిస్సా సీఎంకు అందించిన లేఖలో భట్టి పేర్కొన్నారు.
20వ EPS నివేదిక ప్రకారం రాబోయే మూడు దశాబ్దాల పాటు థర్మల్ విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. 1.5.2024న Moc కార్యదర్శి రాసిన లేఖ ద్వారా గనులకు దగ్గరగా కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లను స్థాపించాల్సిన అవసరం ఉంది. రవాణా ఖర్చును తగ్గించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాల నేపథ్యంలో గని నుంచి విద్యుత్తు ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
సింగరేణి అధికారుల బృందం, ఒడిస్సా అధికారుల బృందంతో జరిగిన చర్చలు రెండు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరమైనవి, ఇవి ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు సానుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తాయని లేఖలో ప్రస్తావించారు. నైని బొగ్గు గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించడానికి తగిన భూమిని కేటాయించేందుకు, ఏర్పాట్లు చేసేందుకుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.