రాజకీయ కక్ష సాధింపులో బాగంగానే తనపై కేసులు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ED) అధికారులు గురువారం విచారించారు. దాదాపు 7 గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
విదేశీ సంస్థకు రూ. 45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు, ఈ కార్ రేసు కేసులో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది.
ఈడీ అధికారుల విచారణ అనంతరం గురువారం రాత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు నమోదు చేశారని రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టే.. ఈడీ కూడా కేసు పెట్టి ప్రశ్నించిందని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ, ఈడీ అధికారులు ఒకే రకమైన ప్రశ్నలు అడిగారని అన్నారు. అడిగిన ప్రశ్నలే అడిగారని చెప్పారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు
రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉందని.. తన మీద కేసు పెట్టించారని కేటీఆర్ ఆరోపించారు. విచారణ కోసం కోట్లలో ప్రజాధనం విచారణ చేయొద్దని రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. కోర్టు లేదా న్యాయమూర్తి ముందు కూర్చుందామని.. నా కేసుపై నీ కేసుపై మాట్లాడదాం అంటూ రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు.
అంతేగాక, తాను లైడిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని.. రేవంత్ అందుకు సిద్ధమా? అని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఎప్పుడు, ఎక్కడ అనేది రేవంత్ రెడ్డి చెప్పినా పర్లేదన్నారు. రూ. 50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయారని కేటీఆర్ ఆరోపించారు. తాను ఈ కేసులో ఎన్నిసార్లు విచారణకు పిలిచినా.. ఎన్ని ప్రశ్నలు వేసినా వచ్చి సమాధానం చెబుతానని అన్నారు. తమకు కోర్టులపై నమ్మకం ఉందన్నారు. తప్పు చేయలేదు, చేయబోమని చెప్పారు. ఇప్పటికైతే తనను విచారణకు మళ్లీ రావాలని ఈడీ పిలవలేదని కేటీఆర్ తెలిపారు.
ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంతకుముందు కేటీఆర్ విచారణ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.