తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ధరల పెంపు పైన ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే, ధరల పెంపు పైన లిక్కర్ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడితో తాజాగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ కమిటీ.. అధికారుల ప్రతిపాదనల పైన అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. ధరల పెంపు పైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొత్త బీర్లు మార్కెట్ లోకి రానున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కొంత కాలంగా మద్యం ధరల పెంపు పైన చర్చ సాగుతోంది. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో గతంలోనే స్పష్టత ఇచ్చింది. కొన్నేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవటంతో.. తయారీ కంపెనీలు పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. మద్యం ధరల పెంపు పైన అధ్యయనం.. సిఫార్సుల కోసం ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 18న తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధరలు కోట్ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది.
కంపెనీల నుంచి వచ్చిన సీల్డ్ కవర్లను ఓపెన్ చేసి ధరలను పరిశీలన చేసింది. 91 కంపెనీలు ఆ సమయంలో ముందుకు వచ్చాయి. అన్ని రకాల మద్యం ఉత్పత్తులతో మొత్తం 1032 బ్రాండ్లుకు ధర కోట్ చేశాయని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్ లోకల్ కంపెనీలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో గత నాలుగేళ్ల కాలంలో మద్యం ధరలు పెరగలేదు. తాజాగా యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్ తమ ఉత్పత్తుల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి లేఖ ద్వారా తమ నిర్ణయం వెల్లడించింది. విక్రయాల పై తమకు వచ్చే మార్జిన్ పెంచాలని కోరింది. దీని పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు.
ఇక, తాజాగా మద్యం ధరల పెంపు అంశం పైన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. కమిటీ నివేదిక ప్రకారమే నిర్ణయాలు ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. కాగా, ధరల పెంపు తప్పదని అధికారుల అంచనా. ఇదే సమయంలో కొత్తగా బీర్లను మార్కెట్ లో ప్రవేశ పెట్టేలా ఉత్పత్తి సంస్థ లు సంప్రదింపులు చేస్తున్నాయి. దీంతో, పూర్తి స్థాయి అధ్యయనం తరువాత కొత్త ధరల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.