గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి భారీ స్థాయిలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది.
అయితే, ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే దాదాపు 45 మంది వ్యక్తుల బృందం ఈ చిత్రం పైరసీ వెర్షన్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. దీంతో చిత్ర బృందం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఏపీ లోకల్ టీవీ అనే టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్‌లో పైరేటెడ్ సినిమా వెర్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసింది. దీంతో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి. చలపతి రాజు నేతృత్వంలోని M/S కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూస్ టీమ్‌తో కలిసి రంగంలోకి దిగింది. గేమ్ ఛేంజర్ పైరేటెడ్ వెర్షన్‌ను ప్రసారం చేసిన అప్పల రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీ కార్యాలయంపై సంయుక్తంగా దాడి నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీవీ ఛానల్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేశారు.
మొదట ‘ఎక్స్’ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గేమ్ ఛేంజర్‌కు వ్యతిరేకంగా ప్రణాళికాబద్ధమైన ప్రతికూల ప్రచారం జరుగుతుందని చిత్ర బృందం గుర్తించింది. ఇందులో భాగంగా కొందరు లీక్ అయిన క్లిప్‌లను మాత్రమే కాకుండా మొత్తం సినిమాను ఆన్‌లైన్‌లో, టీవీలో షేర్ చేయడం జరిగింది. ఈ చర్యలు కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని క్రైమ్ క్లూస్ టీమ్, పోలీసులు తెలిపారు. దాంతో దీనికి కారణమైన వారిని గుర్తించి అరెస్టు చేశారు.