ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఎక్కడా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. ఓపీ సేవలు సరిగా అందకపోవడం విషయమై ఆసుపత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిని నిలదీశారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించారు.
వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు సమయానికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.
నెల రోజుల్లో ఆసుపత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తన ఆకస్మిక పర్యటనలో భాగంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ క్షుణ్ణంగా పరిశీలించారు.