AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు రెడీ.. అలాచేస్తే అరెస్టే అంటూ పోలీసుల వార్నింగ్

న్యూ ఇయర్‌ వేడుకలకు సర్వం సిద్ధమైంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన సంవత్సరం 2025కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబైంది. ఈవెంట్ ఆర్గనైజర్లు నగర వాసుల్లో మరింత జోష్ నింపేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరోవైపు కొత్త సంవత్సరం వేళ వాహన ప్రమాదాలు, గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన ఏరియాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫాంహౌస్ లు, రిసార్ట్స్ లో రాచకొండ పోలీస్ కమిషనర్ స్వయంగా తనిఖీలు నిర్వహించారు. పార్టీల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
న్యూఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్డీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 11గంటల నుంచి ట్రాఫిక్ అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్నిబట్టి ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ వెల్లడించింది. బేగంపేట్, టౌలీచౌకీ మినహా నగరంలోని అన్ని ప్లైఓవర్లు రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మూసివేయనున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే ప్లైఓవర్ పై విమాన టికెట్లు ఉండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తారు. రాత్రి 10గంటల నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ఫ్యాసింజర్ వాహనాలు నగర పరిధిలోకి అనుమతి ఉండదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్యాంక్ బండ్ కు కాలినడకన వెళ్లాలనుకునే సందర్శకులు వాహనాలు సెక్రటేరియట్ విజిటర్స్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన, హెచ్ ఎండీఏ మైదానం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రెడ్ కోర్స్ రోడ్డు, ఆదర్శనగర్ లేన్ వద్ద వాహనాలను పార్కు చేయాలి.

ఇలా చేయొద్దు..
రాత్రిపూట సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
రాత్రి 8గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
వాహనాలపైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు.
హెల్మెంట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా విధించనున్నారు.
సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే వాహనాలు జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
మైనర్ల డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా నడిపే వారి వాహనాలు సీజ్. ఆ వాహనాల యాజమానిపై కేసు నమోదు చేస్తారు.
నెంబర్ ప్లేట్ ఉండని, అధిక శబ్దం చేసే వాహనాలు సీజ్ చేయనున్నారు.
సీజ్ చేసిన వాహనాలు ఆర్టీఏ అధికారులకు పోలీసులు అప్పగించనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10