AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గవాస్కర్‌ కాళ్లు మొక్కిన నితీష్‌రెడ్డి తండ్రి.. ఎమోషనల్ వీడియో

భారత యువ క్రికెటర్‌ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఆస్ట్రేలియా (Australia) తో మెల్‌బోర్న్‌ (Melborne) టెస్టులో 8వ స్థానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ చేయడంతో ఆయన తండ్రి ముత్యాల రెడ్డి (Muthyala Reddy) ఎంతో ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్‌ అనంతరం నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి సునీల్ గవాస్కర్‌ కాళ్లు మొక్కారు. ఆ తర్వాత నితీష్‌ రెడ్డి సోదరి కూడా గవాస్కర్‌ పాదాలకు నమస్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మెల్‌బోర్న్‌ టెస్టు మూడో రోజు ఆట ముగిసిన అనంతరం నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం గవాస్కర్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో నితీష్‌ తండ్రి భావోద్వేగానికిలోనయ్యారు. గవాస్కర్‌ కనిపించగానే ఆయనను ఆలింగనం చేసుకోవడానికి ముందు కాళ్లపై పడ్డారు. మోకాళ్లపై కూర్చుని కాల్లు మొక్కారు. అదేవిధంగా తన కుమారుడిపై ప్రశంసలు కురిపించిన మాజీ ఆటగాళ్లు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో సునీల్ గవాస్కర్.. నితీష్ కుమార్ రెడ్డి గురించి, అతని బ్యాటింగ్ గురించి మాట్లాడారు. ఆతనో వజ్రమని కితాబిచ్చాడు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8వ స్థానంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి.. 189 బంతులు ఎదుర్కొని 114 పరుగులు చేశాడు. దాంతో ఇన్నింగ్స్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నితీష్‌ ఆటను టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తాజా ఇన్నింగ్స్‌తో భారత టెస్టు చరిత్రలో 8వ నంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగి రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నితీష్‌ నిలిచాడు. అంతకుముందు 2002లో వెస్టిండీస్‌పై అజయ్ రాత్రా అజేయంగా 115 పరుగులు చేశాడు. కాగా మెల్‌బోర్న్‌లో సాధించిన సెంచరీని నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రికి అంకితమిచ్చాడు.

ANN TOP 10