యాదగిరిగుట్ట ఆలయంలో ఓ బాలుడికి ప్రమాదం తప్పింది. స్వామివారి దర్శనంకోసం శీఘ్ర దర్శనం క్యూలైన్లో ఉన్న సమయంలో బాలుడి తల ఐరన్ గిల్స్ లో ఇరుక్కుపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి భక్తులు ఐరన్ గ్రిల్ ను బలంగాలాగి బాలుడి తలను సుక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో బాలుడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, తోటి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
బోడుప్పల్ కు చెందిన కుటుంబం శనివారం స్వామివారి దర్శనానికి వచ్చారు. రాత్రి యాద్రిగిరిగుట్ట వద్ద బసచేసి ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లోకి వెళ్లారు. ఇవాళ సెలవు కావటంతో యాదగిరిగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. జనరల్ క్యూలైన్ లో వేచిఉన్న వారు స్వామివారి దర్శనంకోసం దాదాపు గంటకుపైగా, శీఘ్రదర్శనం క్యూలైన్ లో ఉన్నవారికి దాదాపు అర్ధగంటకుపైగా సమయం పడుతుంది. అయితే, శీఘ్రదర్శనం క్యూలైన్లో ఉన్న బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఐరన్ గిల్స్ లో తలపెట్టాడు. దీంతో బాలుడి తల అందులో ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో బాలుడు భయాందోళనతో కేకలు వేయడంతో అక్కడే ఉన్న బాలుడి తల్లిదండ్రులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
తల్లిదండ్రులు చేసిన ప్రయత్నంలో గిల్స్ లో ఇరుక్కుపోయిన బాలుడి తల బయటకు రాకపోవటంతో.. క్యూలైన్ లో ఉన్నతోటి భక్తులు గ్రిల్స్ ను బలంగాలాగి చాకచక్యంగా బాలుడి తలను బయటకు తీశారు. ఈ క్రమంలో బాలుడికి ఎటువంటి గాయాలు కాకపోవటంతో తల్లిదండ్రులు, స్థానిక భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసి అక్కడికి చేరుకునేలోపు బాలుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.