అల్లు అర్జున్‌కు ఇది గుణపాఠం
ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటన అల్లు అర్జున్‌కు గుణపాఠమని, నటీనటులకు సామాజిక బాధ్యత తప్పనిసరి అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన భేటీకి తాను వెళ్లలేదని, అయితే ఆ సమావేశం బాగా జరిగిందని, మంచి సమావేశమని వెళ్లిన వాళ్లు చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంతో సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయినట్లేనన్నారు. ప్రభుత్వం చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాలపై నటీ నటులంతా వీడియోలు చేయాలన్నారు.
చిత్ర పరిశ్రమలో చోటుచేసుకన్న తాజా పరిణామాలపై చర్చించడం జరిగిందన్నారు. అందరిని సమన్వయపరచడానికే ఫిల్మ్ ఛాంబర్ ఉందన్నారు. గతంలో ఫిల్మ్ ఛాంబర్ తరుపునా మేం ప్రభుత్వాన్ని కలిశామని చెప్పారు. గద్దర్ అవార్డు విషయంలో కొన్ని సూచనలిచ్చామని గుర్తు చేశారు. గతంలో మేం కూడా కొన్ని సినిమాలకు బెనిఫిట్ షోలు వేశామని, అయితే ఉచితంగా ప్రదర్శించామని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. దీనిపై ప్రేక్షకులు, ఇండస్ట్రీ కూడా ఆలోచించాలన్నారు. పుష్ప 2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు మరింత గుర్తింపు వచ్చిందని, మనం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నామని, అన్ని భాషల్లో మనవాళ్లు సినిమాలు తీస్తున్నారని, మునుముందు తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు.
అంతకుముందు తమ్మారెడ్డి భరద్వాజ అల్లు అర్జున్ ఘటన ఒక గుణపాఠమని వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో హీరోటు థియేటర్ కు వెళ్లి సినిమా చూసే విషయమై జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకతను చాటిందన్నారు. హీరోలు రోడ్ షో వంటి హడావుడిలకు దూరంగా ఉండాలని, ప్రేక్షకులపై టికెట్ ధరల భారం పెంచడం సరైంది కాదని.. కలెక్షన్స్ పరంగా కాకుండా ఫెర్మామెన్స్ పరంగా తెలుగువారికి గర్వకారణంగా నిలవాలంటూ హితవు పలికారు.